🐦🐭🦌🐢 పంచతంత్రంలో మానవ వికాసం — రోజు 24
కాకి–ఎలుక–జింక–తాబేలు
ఒక్కరి బలం కాదు… భిన్నమైన బలాలు కలిసినప్పుడే నిజమైన జట్టు ఏర్పడుతుంది.
ఒక అడవిలో కాకి, ఎలుక, జింక, తాబేలు మంచి స్నేహితులుగా ఉండేవి. వాటిలో ఏ రెండు జంతువులూ ఒకేలా లేవు.
కాకి వేగంగా ఎగరగలదు. ఎలుక పదునైన పళ్లతో దేనినైనా కొరికేయగలదు. జింక వేగంగా పరుగెత్తగలదు. తాబేలు మాత్రం చాలా నెమ్మదిగా నడుస్తుంది.
ఒకరోజు జింక వేటగాడు వేసిన వలలో చిక్కుకుంది. తన బలంతో బయటపడటానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
అప్పుడు కాకి వెంటనే ఎలుక దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది. ఎలుక వచ్చి తన పళ్లతో వలను కొరికి జింకను విడిపించింది. అంతవరకు నెమ్మదిగా నడుచుకుంటూ తాబేలు కూడా అక్కడికి చేరుకుంది.
అప్పుడే వేటగాడు తిరిగి వచ్చాడు. జింక, కాకి, ఎలుక వెంటనే తప్పించుకున్నాయి. కానీ వేగంగా కదలలేని తాబేలు వేటగాడికి చిక్కింది.
ఇప్పుడు మిగతా ముగ్గురు తమ స్నేహితుడిని వదిలిపెట్టలేదు. ఒక పథకం వేశారు.
జింక కొద్దిదూరంలో చనిపోయినట్లు పడుకుంది. కాకి దాని మీద కూర్చొని ముక్కుతో పొడుస్తున్నట్లు నటించింది.
దానిని చూసిన వేటగాడు — “తాబేలు ఎక్కడికీ పోదు. ముందు ఈ జింకను తీసుకుందాం” — అని తాబేలును కింద పెట్టి జింక వైపు వెళ్లాడు.
అదే సమయంలో ఎలుక తాబేలును కట్టిన తాడును కొరికేసింది. తాబేలు నీటిలోకి వెళ్లిపోయింది.
వేటగాడు జింక దగ్గరకు చేరుకునేలోపే జింక పరుగెత్తింది. కాకి ఎగిరిపోయింది. చివరకు వేటగాడి చేతికి ఏదీ చిక్కలేదు.
🌱 మానవ వికాసానికి ఈ కథ చెప్పే పాఠం
మనమందరం ఒకే విధమైన ప్రతిభ కలిగి ఉండాల్సిన అవసరం లేదు.
ఒకరికి మంచి జ్ఞానం ఉండవచ్చు. మరొకరికి ధైర్యం ఉండవచ్చు. ఇంకొకరికి వేగంగా నిర్ణయం తీసుకునే శక్తి ఉండవచ్చు. మరొకరికి సహనం ఉండవచ్చు.
విజయవంతమైన జట్టు అంటే అందరూ ఒకేలా ఉండటం కాదు. భిన్నమైన సామర్థ్యాలు ఒకే లక్ష్యం కోసం పనిచేయడం.
ఒక తరగతి గదిలో కూడా ఇదే నిజం. ఒక విద్యార్థి విషయాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. మరొకరు దాన్ని అందంగా వివరించవచ్చు. ఇంకొకరు presentation బాగా చేయవచ్చు. మరొకరు technology ఉపయోగించడంలో నిపుణుడై ఉండవచ్చు. ఈ నలుగురినీ కలిపితే మంచి project తయారవుతుంది.
ఒక సంస్థలో కూడా accountant, marketer, technician, manager — అందరి పాత్ర వేరు. కానీ సంస్థ విజయం మాత్రం అందరి సమన్వయంపై ఆధారపడి ఉంటుంది.
💡 ఈరోజు ఆలోచన
“నీకు అన్నీ రావాల్సిన అవసరం లేదు. నీకు రాని దానిలో బలమైన వ్యక్తిని నీతో కలుపుకోగలగడం కూడా ఒక గొప్ప సామర్థ్యమే.”
— MVRTalks
I reflect… You respond.